Sunday, April 28, 2013

రూలర్ కథ -18


 దృశ్యాల్ని టీవీలో చూస్తున్న శిరీష కళ్ళలో నీళ్ళు రాలాయి. మనస్సు సంతోషంతో పొంగి పోయింది.


లత సరిగ్గా అప్పుడే శిరీష గదిలోకి ప్రవేశించింది.

"విజయ్  లెటర్ నీకు ఇవ్వమని చెప్పాడు ..."అని లత తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని శిరీషకు అందించింది.

ఆతృతగా దాన్ని తెరచి  చదివింది.

నేస్తమా,

ఏమని చెప్పను... ఎలా మొదలెట్టను ?

ఎలా రాయెను నీ మనసు నొప్పించాననీ...

హాస్పిటల్లో ఉన్న నిన్ను చూడాలి ఉంది. ఇనుప సంకెళ్ళను తెంచుకుని నీ దగ్గరకు వెళ్లాలని  ఉంది. నా ఆశయం కోసం నీప్రేమను పోగొట్టుకున్నాను.తాత్కాలికంగా మనం విడిపోయినా నీ జ్ఞాపకాలు నాతోనే ఉన్నా యి. నా ఆశయం కోసం నేను  తీసుకున్న కఠిన నిర్ణయాలు తప్పుకాదనిపించిది. దాని మూలంగా కోటాను కోట్లమంది తరతరాలుగా సంతోషంగా ఉంటారు!ఆశయం గొప్పది. కష్ట పడ్డాను .సాధించాను. కానీ నీ ప్రేమలో ఓడిపోయాను.

జీవిత లక్ష్యాన్ని గెలిచే ప్రయత్నంలో ప్రేమకు దూరం అయ్యాను. దాన్ని ఇలా నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నమే ఇదంతా. ఆశయ సాధన కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను. నీ మనసు నొప్పించాను. మన్నించు.  నన్ను క్షమిస్తే, ఆనాడు నాఇoటి ముందు, గుమ్మంలో ఫ్లవర్ బోకే తో నిల్చొన్న అందమైన నీ రూపాన్ని తలచుకుంటూ నా జైలు జీవితం గడిపేస్తాను. ఆతరువాత...

                                                                                                                 ప్రేమతో,

                                                                                                                  విజయ్.

ఆమె  ఉత్తరాన్ని అలాగే తన రెండు చేతులతో దగ్గరకు తీసుకుని పెదవులతో ముద్దుపెట్టుకుంది.
                                                                     
                                                                                 *****
ఏడేళ్ళ తరువాత...

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు.

జైలు నుండి విడుదలయ్యాడు విజయ్.

జైలు నుండి బయటకు రాగానే తనకోసం చకోర పక్షి లా ఎదురుచూస్తున్న శిరీషను చూసాడు. ఆమె ప్రక్కనే ఆమె తండ్రి ఆనంద రావు కూడా ఉన్నాడు. ఆమె   రోజు కోసం, తనకోసం, తన పిలుపు కోసం, ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నట్లు ఉంది.

ఆమెను దగ్గరకు రమ్మని చేతులు చాచి పిలిచాడు. పరుగున వచ్చి అతని యద మీద వాలి పోయింది. అప్రయత్నంగా ఆమెను హత్తు కున్నాడు. ఆమె కంటి నిండా ఆనంద బాష్పాలు...మెల్లగా ఆమె తల మీద చేయివేసి మెల్లగా తల  నిమురుతున్నాడు.

విజయ్ చెక్కిలి నుండి  కన్నీటి చుక్క జారి ఆమె పై పడింది. "శిరీషా! నీ ప్రేమ అద్భుతం" అన్నట్లుగా ఉంది ఆదృశ్యం 

అంతలో కొద్ది దూరం లో  జనం అరుపులు, కేకలు విన్పించాయి...

తలెత్తి అలా చూసాడు.

జనం. జనం...ఎటుచూసినా జనం. ఇసుక వేస్తె రాలనత జనం. పెద్ద పెద్ద తాత్కాలిక బారికేడ్లను ఏర్పాటు చేసి కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. విజయ్ కోసం అతడి నుండి వచ్చే చిన్న సైగకోసం, నోటినుండి వెలువడే మాట కోసం...అది రాగానే బారికేడ్లను కూడా లెక్కచేయకుండా ముందుకు దూకాలనే ఆత్రుతతో ఉన్నారు జనం. దాని గ్రహించాడు విజయ్.

శిరీషకు కొద్దిగా దూరంగా జరిగాడు.

జనం వైపు నడిచాడు.

అంతే!

జనం ఒక్క ఉదుటున బారికేడ్లను దాటి విజయ్ దగ్గరకు వచ్చారు. క్షణం లో జనం మద్యలో ఉన్నాడు విజయ్. అతడ్ని ఆకాశానికి ఎత్తేసారు. పూల వర్షం కురిపిస్తున్నారు. పొగడుతున్నారు. అరుస్తున్నారు. కేరింతలు కొడుతున్నారు  జేజేలు కొడుతున్నారు. జాతరలో దేవుడ్ని ఊరేగిస్తున్నట్లు ఊరేగిస్తున్నారు. పైనుండి  అందరూ ఆశీర్వదిస్తున్నారు... అందరికి శ్రీ కృష్ణుడిలా,తారక రాముడిలా కన్పిస్తున్నాడు.

"నాయకుడు జనం లోంచి పుడతాడు. ప్రజలచేత, ప్రజలకోసం బ్రతుకు తాడు".

శుభం.




No comments: