Sunday, April 28, 2013

రూలర్ కథ -13


లత ఇంటి ముందు బైక్ ఆపింది శిరీష.

శిరీషను చూడగానే లత సంతోషం రెట్టింప య్యింది. పరుగున వచ్చి శిరీష ముందు వాలిపోయింది. 'రా ... వెళదాం' అంటూ చేతులు పట్టుకుని, ఆప్యాయంగా పిలుచుకెల్లింది.

"చాలా రోజుల తరువాత మా ఇంటికి వచ్చావు. నాకు చాలా హ్యాపీ గా ఉంది. ఇక్కడే కూర్చో... గాలి బాగావస్తుంది. కరెంట్ లేదు. ఇంట్లో ఉండటం కష్టం..."అని ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో కుర్చీ వేసింది.

"ఉండు. రెండు నిమిషాల్లో వచ్చేస్తాను..." అని లోనికి వెళ్ళ బోయింది.

ఆమె చేయి పట్టుకుని ఆపింది శిరీష. "నాకేమీ వద్దు. ఇప్పుడే ఇంట్లో తినేసి వచ్చాను..."

"రాక రాక మా ఇంటికి వచ్చావు. కనీసం కాఫీ అయినా ఇస్తాను. కాదనకు. నా తృప్తి కోసం... ప్లీజ్!" అని జవాబు కోసం ఎదురు చూడకుండా లోనికి వెళ్ళిపోయింది.

లత ఇంట్లోకి వెళ్ళింది. శిరీష బోర్ గా ఫీల్ అయ్యింది. పరిసరాలు చూసింది. చిన్న చిన్న ఇళ్ళు. అదీ దూర దూరం గా ఉన్నాయి. మధ్య మధ్య లో ఖాళీ స్టలాలు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్లు వున్నాయి. పనివాళ్ళు, రోజూ వారీ కూలీలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు ... ఉండే ఏరియా లా ఉంది..."అనుకుంటున్న ఆమె ఆలోచనలు లత వస్తున్న అడుగుల చప్పుడుతో ఆగి పోయాయి.

లత ఇచ్చిన కాఫీ తీసుకుంది. లత ఆమె కు ఎదురుగా కూర్చుంది. సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతలో అక్కడికి లత తండ్రి వచ్చాడు. శిరీషను చూడగానే ఆప్యాయంగా పలకరించాడు.

"బావున్నావమ్మా!"

"బావున్నాను అంకుల్".

"లతా! తినడానికి ఏమైనా పెట్టు..." అన్నాడు కూతురితో.

"వద్దు అంకుల్. ఇప్పుడే కాఫీ త్రాగాను..."

అతను ఇక అక్కడ ఉండడం మర్యాద కాదని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

అతడి నడకలో జీవం లేదు. మాటల్లో మందు వాసన వచ్చింది. అతడు అలా ఇంట్లోకి వెళ్తుంటే విజయ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి శిరీషకు.

"కూతురు సంపాదన కోసం పెళ్లి సంబంధాలు చెడగొడు తున్నాడేమో!"

అలా క్షణం సేపు అలా ఆలోచించింది. వెంటనే తనని తను తిట్టుకుంది. అందుకే అనుమానం ఫెనుభూతం అంటారు పెద్దలు...అనుకుంటూ లతను చూసింది.

లత చూపులో తేడా ఉంది! తన ముందే ఎవర్నో లైనేస్తోంది...అన్న అనుమానంతో లత చూస్తున్న వైపు చూసింది. అంతే! దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపొయింది. అక్కడ... పక్కింట్లో  నుండి వస్తూ కన్పించాడు... విజయ్ !

ఆమె సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుండి పోయింది. తరువాత తేరుకుంది. లత వైపుచూసింది. ఆమె సిగ్గుపడింది. శిరీషకు తన ప్రేమ విషయం తెలిసిపోయిందని మరింత సిగ్గుపడింది. అందంగా ఉంది దృశ్యం.

"అతనెవరో తెసుసా!" శిరీష అడిగింది.

తెలుసన్నట్లు తలాడించింది లత మరింత సిగ్గుతో.

"ఎవరు?" అని అడిగింది ఆశ్చర్యంగా.

"  ఇల్లే.. చాలా మంచివాడు. ఏడాది నుండి ప్రేమిస్తున్నాను.అయితే వన్ సైడు మాత్రమే... వైపు నుండి మాట గాని, చిన్న సైగ గానీ లేదు..."

"నీ ముఖం! అతనెవరో తెలుసా.. శిరీష ఇం స్ట్రీస్ ఎం. డి..."

" అంటే... విజయ్ గారు... మీ..."అర్దోక్తిగా ఆపుచేసింది.

అవునన్నట్లు తలాడించింది శిరీష.

"నేను నమ్మలేక పోతున్నాను... ఆయన ఇక్కడ... ఇలా..."అని తన ఆశ్చర్యాన్ని కంటిన్యూ చేసింది.

అంతలో అక్కడనుంచి విజయ్ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వీళ్ళను చూడ్లేదు. శిరీష కూడా అతడ్ని పలకరించలేదు. ఆపే ప్రయత్నమూ చేయలేదు. అతను అలా వెళ్ళగానే అతను ఉన్న ఇంటికి బయలుదేరింది.

ఇంటి డోర్ లాక్ చేసి ఉంది.

"రాయి తీసుకో తాళం కప్పు పగుల గొ డదాం..."అంది శిరీష.

"వద్దొద్దు...తాళం చెవి ఇక్కడో ఎక్కడో పెట్టుంటాడు... మామూలుగా అయితే తలుపు మీద పెడతాడు..."అంటూ అలా తలుపు మీద తడిమి "దొరికింది..." అంది లత.

"బాగానే అబ్జర్వ్ చేస్తున్నావే!" అంది కొంటెగా.

కొంచెం సిగ్గుపడుతూ,"పో...శిరీషా... " అంటూ తాళం తెరిచింది.

శిరీష ఇంట్లోకి అడుగు పెట్టింది. పెద్ద హాలులా ఉంది. ఒకటే గది. ప్రక్క కిరోసిన్ స్టవ్. కొన్ని వంట పాత్రలు. మొరొక ప్రక్క కొన్ని పేపర్లు, ఫైల్స్! చోట తను రాసిన కవిత గోడకు వ్రేలాడుతోంది...తను డిగ్రీ చదివేటప్పుడు తన క్లాస్ మేట్స్ రూమ్స్ గుర్తుకు వచ్చాయి శిరీషకు! ఇలాంటి షీట్స్ ఇంటిలో ఎందుకున్నాడబ్బా అనుకుంటూ పేపర్ల దగ్గరకు వెళ్ళింది. ఏవో రీసెర్చ్ పేపర్లు లా ఉన్నాయి అని వాటిని అందుకోబోయి, ప్రక్కనే  కనపడిన డైరీ తీసుకుంది.

డైరీ పైన ఉన్న ఇయర్ చూసి గత ఏడాది డైరీ. అయినా కొత్తది లా ఉంది...అనుకుంటూ డైరీ ఓపెన్ చేసింది.

ముత్యాల్లాంటి అక్షరాలతో రాసిన మాటలు చదివింది.

"శిరీషా! డైరీ రాసే అలవాటు నాకు లేదు. ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని ఇన్నాళ్ళు వాడలేదు. అవసరం రాలేదు. నన్నెవరు ఏమైనా అన్నా విన్నాను.పట్టించుకోలేదు. నా ప్రాణానికి ప్రాణమైన నీవు చిన్న మాట అనినా తట్టుకోలేక పోతున్నాను. నీ తో చెప్పుకోలేని మాటల్ని ఇందు లో రాస్తే నా  బాధకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని రాస్తున్నాను.. రోజు  అనాధ అనీ, తల్లి దండ్రుల ప్రేమానురాగాలు తెలియవని తిట్టావు. మనం కర్మ సిద్దాంతం నమ్ముతాము. తల్లిదండ్రులను ఆరాధిస్తాం. పూజిస్తాం. కన్న కొడుకు కోసం తల్లి తన గుండెను కోసి ఇచ్చిందన్న కథను చదివాం. విన్నాం. అలాగే ఈదేశంలో తల్లిదండ్రులను కావడిలో మోస్తూ తీర్థ యాత్రలు చేయించే శరవణుడు లాంటి పుత్రులున్నారు. నిస్వార్ధంగా పోషించే బిడ్డలున్నారు. నేను సుమారు ఆరొందల మంది చేత ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను. ఎనభై శాతం మంది తల్లిదండ్రులకు అపోజిట్ గా రాసిన వారే! డబ్బున్న వాళ్ళు కూడా తమ పెళ్ళిళ్ళను పెద్ద వాళ్ళు స్టేటస్ సింబల్ గా, ఆస్తుల్ని పెంచుకోవ డానికి తమ  పెళ్ళిళ్ళను ఉపయోగించు కుంటున్నారని రాశాను. నా ఉద్దేశ్యం పెద్ద వాళ్ళంతా  చెడ్డ వాళ్ళు కాదు బిడ్డలంతా తల్లిదండ్రులను గెంటెసే ద్రోహులు కారు. నువ్వు నాకు 'ప్రేమాను బంధాలు' తెలియవని అన్నావు.  అన్నీ దగ్గర్నుంచి చూశాను... నేను అనాధను. కానీ ఆఫీలింగ్ నాకెప్పుడూ కలుగ లేదు! ఇప్పుడు నాకు నువ్వున్నావు. అంతే చాలు. నాప్రాణంనన్నేమైనా అంటే నేనెలా తట్టుకోగలను! నువ్వు డబ్బు మనిషివి అని తిడుతున్నప్పుడు నేనెంత నరకం అనుభావించానో తెలుసా! మాటల్లో చెప్పలేను. నా ఆశయం కోసం నేను కొన్ని కఠిన మైన నిర్ణయాలు  తీసుకున్నాను. త్వరలో నా ఆశయం నెరవేర బోతోంది. ఆరోజు నాకున్న ఆస్తులన్నీ పేదలకు పంచేస్తాను.అప్పుడు నీ దగ్గ రకు వచ్చేస్తాను.నా ఆశయం నెరవేరే వరకు నీ 'ప్రేమ' ను పొందలేను! నీవు అనుమానంగా చూసే చూపు, మాటలు నన్ను బాధించినా నా ఆశయం కోసం ఓర్చుకోవాలి. తప్పదు. భరించాలి... ఇంకొన్ని రోజులే...అంత వరకు నన్ను క్షమించు ప్రియా !"

డైరీ చదువుతున్నంత సేపూ ఆమెకు దుఃఖం ఆగలేదు. శిరీష ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక అలాగే చూస్తుంది పోయింది లత.

"లతా! నేను అర్జెంటు గా విజయ్ ను కలవాలి. చూడాలి. మాట్లాడాలి. పద..పోదాం పద..."అంది శిరీష.

లత సరేనంది.

శిరీష నడుపుతున్న బైక్ ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఆమె ఆలోచనలు అంతకంటే వేగంగా వెళుతున్నాయి.  విజయ్ గురించి ఆలోచిస్తోంది. ఆమె మదిలో పాత జ్ఞాపకాలు మెదిలాయి. విజయ్ లంచ్ బాక్స్ లో చాలా సార్లు పెరుగన్నం చూసింది! ధరించే దుస్తులు బ్రాండెడ్ వి కావు... అప్పుడంతగా పట్టించు కోలేదు. కానీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి...అతని సింప్లిసిటీ! ఎందుకలా... ఆమె మదిలో రకరకాల ఆలోచనలు.

అంతలో బైక్ కు కుక్క అడ్డం వచ్చింది. దాన్ని తప్పించబోయింది. అటువైపు వస్తున్న కారును చూసుకోలేదు!

పెను ప్రమాదం జరిగింది.

వేగంగా వస్తున్నా కారును 'ఢీ'కొట్టేసరికి  శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి.

శిరీష సృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలో కి వెళ్ళిపోయింది. వెనకాల ఉన్న లతకు అంతగా దెబ్బలు తగల్లేదు. సృహ ఉంది. "హెల్ప్...హెల్ప్..."అని అరుస్తోంది.

జనం గుమికూడారు. కొందరు యాక్సి డెంట్ జరగానే అంబులెన్స్ కు ఫోన్ చేసారు. వాటర్ బాటిళ్ళతో నీళ్ళు తెచ్చారు. కారు డ్రైవర్ కు దేహశుద్ది చేశారు!

అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా ప్రవేట్ వెహికల్స్ ఆపి,అందులో హాస్పిటల్  కు తీసుకెళ్ళారు  స్టానికులు.

డాక్టర్లు ఎక్సరే లు, రకరకాల పరీక్షలు  చేశారు. చివరకు " తలకు బలంగా గాయం అయ్యింది.కుడికాలు మ్రొకాలు క్రింది భాగాన ఎముక విరిగింది. ప్రాణాలకు భయం లేదు.విరిగిన  ఎముకకు ఇనుపరాడ్ల తో కట్టు కట్టాలి...త్వరగా కోలుకుంటుంది. నడవడానికి ఆర్నెల్లు పడుతుంది. కనీసం మూడ్నెల్ల యినా  బెడ్ రెస్ట్ కావలి..."అన్నారు డాక్టర్లు.

*****

1 comment:

Anonymous said...

katha chaalaa baavundi