Sunday, April 28, 2013

రూలర్ కథ -07


శిరీష  ఇండస్ట్రీస్  ప్రొప్రయిటర్ సీట్లో కుర్చుని వీక్లీ చూస్తున్నాడు విజయ్. అందులో శిరీష రాసిన కవిత ఉంది. దాన్ని అతను తనివి తీరా చదువుతున్నాడు.

సరిగ్గా అప్పుడే డోర్ తెరచుకుని లోనికి వచ్చింది శిరీష.

అమ్మాయిని చూడగానే ఆశ్చర్యం, సంతోషం ఒకేసారి కలిగాయి. వీక్లీ ప్రక్కన పడేశాడు. "రా... కూర్చో" అంటూ మర్యాద చేశాడు.

బెట్టు చేసింది. తీక్షణంగా అతని వైపు చూస్తూ కూర్చో  కుండా అలాగే నిల్చొంది.

 "ఇన్నాళ్ళు ఏమయ్యావు? కన్పించకుండా ఎక్కడికి వెళ్లావు?  ఇల్లు ఖాళీ చేసేశావు. ఎక్కడున్నావు? అసలు నేను గుర్తు ఉన్నానా? కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. అంత బిజీనా? కనీసం చూడాలని కూడా అనిపించలేదా? మాట్లాడాలనిపించ  లేదా ? ...చెప్పు" అంటూ ప్రశ్న వర్షం కురిపించింది.

"నేను నిన్ను మర్చిపోతే కదా గుర్తుకు తెచ్చుకో వడానికి! అను క్షణం నా మదిలో నీ వే మెదలు తున్నావు. అయినా నిన్ను కలువలేక పోయాను! నీకోసం నిన్ను నాదాన్ని చేసుకోవడం కోసం, మీ నాన్నతో చేసిన ఛాలెంజ్ గెలవడం కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాను. అయినా నేను బిజీగా ఉన్నానని చెప్పను. ఎందుకంటే నీ కంటే ముఖ్యమైనది నాకు మరొకటి లేదు. నా కోసం నువ్వు నీ కోసం నేను పుట్టాం. మనల్ని ఎవ్వరూ విడదీయ లేరు. నేను ' లక్ష్యం' ఏర్పరచు కున్నాను. దాన్ని సాధించడం  కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. అది సాధించాక మనం పెళ్లి చేసుకోవచ్చనుకున్నాను. అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. నీ గురించి, నీ వైపు నుంచి ఆలోచించ లేక పోయాను. యాం సారీ..."

అతని మాటలు అమ్మాయికి కొంత ఊరటను కలగించాయ్. అయినా కోపం తగ్గలేదు. అలాగే నిల్చొని ఉంది.

"శిరీష! ప్లీజ్. నన్నర్థం చేసుకో. చూడు ఇప్పుడు కూడా నీ కవితనే చదువు తున్నాను. .."అంటూ వీక్లీ చూపించాడు.

అమ్మాయి సంతోషంతో పొంగిపోయింది. తనకు ఇష్టమైన రంగం గురించి మాట్లాడినా, పొగడినా సంతోషం కలగనిదెవ్వరికి! శిరీష సంతోషాన్ని అతడు గ్రహించాడు.

"నీ కవిత అద్బుతం. నాకు బాగా నచ్చింది. బావుంది. చాలా బావుంది. చాలా చాలా బావుంది. దాన్ని ప్రింట్ చేయించి, ఫ్రేం కట్టించి నా బెడ్ రూం లో పెట్టుకో బోతున్నాను".

సంతోషంతో పొంగిపోయింది గర్వంగా ఫీలయ్యింది. "చాలా ఎక్కువ చేస్తున్నావ్..." అని చిన్నగా నవ్వింది.

"హమ్మయ్య. కోపం తగ్గింది. అదే చాలు. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడూ నీకు దూరం కాను! ప్లీజ్. నన్ను మన్నించి కూర్చో...ప్లీజ్!" బ్రతిమాలాడు.

"చాలాకాలం తరువాత కలుసు కున్నాము. అలా సరదాగా బయటికి వెళ్దామా? " అంది.

"ఎక్కడికి? హోటల్ కి వెళ్దామా?"

"ఊహూ! "

"గుడికి..."

"ఊహూ! మరెక్కడికైనా వెళ్దాం".

"నేనెక్కడికి వెళ్దామని చెప్పినా రానంటున్నావు. పోనీ నేవే ఎక్కడికెళ్ళాలో చెప్పు." అవకాశం శిరీషకు ఇచ్చాడు.

"పార్క్ కెళ్దామా?"

"నీ ఇష్టం" అని కాలింగ్ బెల్ నొక్కాడు. ఫ్యూన్ పరుగెత్తుకుని  వచ్చాడు. కారు తాళాలు అతనికి అందిస్తూ, "కారు బయటకు తీసుకురా..." అన్నాడు.

"కార్లో వద్దు. అలా సరదాగా వెళ్దాం"అంది.

ఫ్యూన్ కాసేపు అక్కడే నిలబడ్డాడు. విజయ్ ఏమీ చెప్పక పోయేసరికి, అమ్మాయి చెప్పిన మాటల్ని కన్ ఫర్మ్ చేసుకున్నాడు. తాళాలు టేబిల్ మీద పెట్టేసి, అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

"అంత దూరం నడిచి వెళ్ళాలంటే కష్టం. కనీసం బైక్ మీద వెళ్దామా?".

"ఊహూ! అలా నడుచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, రోడ్ల మీద అన్నింటినీ చూసుకుంటూ, వెళ్తుంటే ఎంత బావుంటుంది!".

"ఇలాంటి చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి . లేకపొతే అవి కాస్త పెరిగి కొండంత అసంతృప్తి గా మారిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న కోర్కెలు ఒకసారి చేస్తే చాలు. మళ్ళీ మళ్ళీ చేయాలని పించదు! వద్దనో, విసుక్కునో తిరస్కరిస్తే, చేస్తే బావుండు అన్న కోరిక మనసులో కలిగి వేధిస్తుంటుంది. అంతేకాదు తన మాటకు విలువ ఇవ్వలేదని బాధపడతారు. ఇటువంటి కోర్కెలు తీర్చనప్పుడు తన ప్రేమ మీద సందేహం కలుగుతుంది! అందుకే కాదనలేక 'సరే'నన్నాడు.

ఒకరి చేయి ఒకరు పట్టుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ప్రక్క ప్రక్కన నడుస్తూ, అలా రోడ్ల వెంట తిరుగుతూ, చిరు తిండ్లు కొంటూ, అలా అలా సరదాగా పార్కు దగ్గరకు వెళ్ళారు".

ఇద్దరూ పార్కు లో మూలగా కూర్చున్నారు.

విజయ్ అమ్మాయితో కల్సి పార్క్ కు రావడం అదే మొదటిసారి!

"శిరీషా! లక్ష్యం ఏర్పరచుకుని దాని కోసం శ్రమించి, అది పదిమందికి ఉపయోగ పడుతుంటే, చూసి ఆనందించడం తప్పు కాదు కదా! నేను ప్రజల బాగు కోసం ' పని' చేయాలనుకుంటు న్నాను .. లక్ష్యం కోసం..."అని సాగుతున్న మాటలకు బ్రేక్ వేసింది. తన మనసులోని భావాలు వెలిబుచ్చింది.

"చక్కని దృశ్యాలు. మెల్లగా పలకరించే పిల్లగాలులు. సువాసనలు వెదజల్లే పువ్వుల పరిమళాలు. ఇంత అందమైన ప్రదేశాలలో టాపిక్ అంత అవసరమా?"

తరువాత విజయ్ మాట్లాడలేదు. చుట్టూ వున్న వాళ్ళను చూస్తూ ఆలోచనలో పడిపోయాడు.

"లవర్స్. ముసలివాళ్ళు. కాలేజ్ స్టూడెంట్స్...జంటలు జంటలుగా ఉన్నారు. కబుర్లు చెప్పు కుంటున్నారు. త్రుళ్ళి త్రుళ్ళి పడుతున్నారు. పడి పడి నవ్వుకుంటున్నారు. అరుస్తున్నారు. గెంతులేస్తున్నారు... రహస్యంగా  మాట్లాడుకుంటున్నారు...అసలు అంతగా మాట్లాడుకోవడానికి వాళ్ళ దగ్గర మేటర్ ఏముంటుంది? సచిన్ బ్యాటింగ్, తెలంగాణా సమస్య, సినిమాల గురించో మాట్లాడుకోవడానికి పార్కుకి రానక్కరలేదు. అలా మాట్లాడుకుంటూ, పోగాడుకుంటూ ఉంటే బోర్ కొట్టదా!"

"విజయ్! నాకేం పన్లేక నీతో పార్క్ కు వచ్చానను కుంటున్నావా? అటు చూడు ప్రేమికులెంత సరదాగా ఉంటున్నారో...ఇలా అయితే ఇక్కడెందుకు పద పోదాం".

"ఏయ్! ఎందుకంత కోపం. నీకు ప్రకృతి అంటే ఇష్ట మనీ, డిస్టర్బ్ చేయకూదనీ...మాట్లాడలేదు!:

"అవున్నిజమే!" అనుకుని పార్క్ లోని అందాలను చూస్తూ ఉండిపోయింది. అతను మళ్ళీ  తన ఆలోచనలో పడిపోయాడు.

"తిండి కోసం రైతులు దుక్కి దున్నుతున్నారు. శ్రామికులు రోజంతా కస్టపడి పనిచేస్తున్నారు. పని మనుషులు ఇళ్ళ సంఖ్య పెంచుకుంటున్నారు...కానీ వీళ్ళంతా ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు!"

"విజయ్! నీకెంత చెప్పినా లాభం లేదు. నీతో రావడం నాది బుద్ది తక్కువ. ఇక చాలు నీ ప్రేమ. లే. పద పోదాం".

అంతలో విజయ్ సెల్ మ్రోగింది.

చొరవగా అతని జేబులోని సెల్ తీసుకుని 'హలో'అంది.

"నేను కల్పన ను మాట్లాడు తున్నాను. సర్ ఉన్నారా?"

"కల్పనా! ఎవరు మీరు?" తెలుసుకోవాలిని అడిగింది.

కల్పన పేరు వినగానే ఫోన్ తీసుకుని, "నేనే మాట్లాడు తున్నాను. చెప్పు కల్పనా?" అన్నాడు.

ఆమె చెప్పింది విన్నాడు.

"నేను పదే పది నిమిషాల్లో వచ్చేస్తాను..."అన్నాడు ఫోన్ లో.

"శిరీషా! నాకు అర్జెంట్ పని ఉంది. నీవు త్వరగా ఆటోలో ఇంటికి వెళ్ళు."అని అమ్మాయి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా అక్కడనుంచి వెళ్ళిపోయాడు విజయ్.

"ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు? అంత అర్జెంట్ పనేమీ? ఎందుకు రమ్మని చెప్పింది?..."అలా ఆలోచిస్తోంది శిరీష.

*****

4 comments:

Suneetha S said...

When this film will come. Excellent story...real story

Purushotham Reddy Nellore said...

Super story and very ininteresting...

Anonymous said...

heroine name I likes more

Vijayawada said...

good story. send me your phone number