Sunday, April 28, 2013

రూలర్ కథ -04


నేషనల్ హై వే లో విజయ్ నడుపుతున్న బైక్ ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అతడి అలోచనలు అంతకంటే వేగంగా వెళుతున్నాయి.

"శిరీష గురించే ఆలోచనలు. ఆమె తండ్రితో ఏమి మాట్లాడాలి? ఎలా చెప్పాలి? అతను ఏమి అడుగుతాడు? శిరీష తన గురించి చెప్పి ఉంటుందా? ఏమి చెప్పి ఉంటుంది?...కాదంటాడా, అవునంటాడా?...శిరీష ఎప్పుడు రమ్మంటుంది? ....అనుకుంటూ  వెళుతున్నాడు.

దూరంగా రోడ్డు ప్రక్కన ఇద్దరు వ్యక్తులు బైక్ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళను చూస్తే బైక్ రిపేర్ అయిపోయి అవస్థ పడుతున్నట్లు ఊహించాడు. విజయ్ అలా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అతని ఊహ నిజమైంది. వాళ్ళలో ఒకతను 'లిఫ్ట్' అడిగాడు.

విజయ్ బైక్ ఆపాడు. అతను వచ్చి స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు. బైక్ మీద కూర్చుంటూ రోడ్డు ప్రక్కన ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ,'ఒరేయ్!బండిని రిపేర్ చేయించుకుని సిటీ సెంటర్లో  ఉన్న హోటల్ దగ్గరకు వచ్చేసేయ్ ..." అన్నాడు.

అలా కొద్ది దూరం వెళ్ళగానే హైవే ప్రక్కన ఉన్న హోటల్ దగ్గర బైక్ ఆపమన్నాడు. విజయ్ ఆపాడు.

"ఒక్క నిమిషం ఆగండి ! వెంటనే వచ్చేస్తాను...అంటూ సమాధానం కోసం కూడా ఆగకుండా హోటల్ లోకి వెళ్ళాడు. కాసేపటికే డబ్బులు లెక్కపెట్టుకుంటూ వచ్చి బైక్ ఎక్కాడు. బైక్ ముందుకు నడిపాడు విజయ్. "ఎవరితను...?" అని ఒక్క క్షణం ఆలోచించి, ఎవరైతే 'మనకెందుకులే!' అనుకున్నాడు.

అలా కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ మరొక హోటల్ ముందు బండి ఆపమన్నాడు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. డబ్బులు లెక్క పెట్టుకుంటూ వచ్చి బైక్ ఎక్కాడు.

"ఎవరితను? హోటల్ యజమనా? చూడ్డానికి నియో రిచ్ లా ఉన్నాడు!అనుకున్నాడు. ఆపైన టెన్షన్ భరించలేక అడిగేశాడు.

"ఎవరుమీరు?".

" హై వేలో ఉన్న ఊర్వశి హోటల్స్ యజమానిని!"

"హోటల్ బిజినెస్ బాగా జరుగుతోందా?" జస్ట్ తెలుసు కోవాలనే కుతూహలంతో అడిగాడు. అయితే అతను చెప్పే మాటలు తన జీవితాన్ని మలుపు తిప్ప బోతాయని విజయ్ క్షణం ఊహించలేదు!

"రెండేళ్ళ క్రితం రెండు హోటల్స్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు  పన్నెండు  ఉన్నాయి".

"అంత  బిజినెస్ ఉందా!"

ప్రతి దానికీ అలా ఆశ్యర్య పోతారెంటండీ మా హోటల్స్ లో ఫుడ్ కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు 'తోలు' వ్యాపారం కూడా జరుగుతుంది!

విషయం అర్థమైనట్లు, "అలాగా! ఒక వేల పోలీసులు 'రైడ్' చెస్తే..."తన సందేహాన్ని వ్యక్తం చేశాడు.

"ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు! వాళ్ళను డబ్బుతో మేనేజ్ చేస్తాం. అంత అవసరం కూడారాదు! అలాంటి ప్రమాదాన్ని ముందే గ్రహించి మావాళ్ళు వెనుక భాగం నుండి పారిపోతారు. లేదా ఇక్కడ అలాంటివి జరగవని నమ్మిస్తారు! హోటల్ ఆనుకుని అక్కడ 'పని' చేసే వాళ్లకు ఇళ్ళు నిర్మిస్తాం! ఇంట్లో వాళ్ళను పోలీసులు అరెస్ట్ చెయ్యరు! ప్రతి చిన్న విషయానికి భయపడితే ప్రపంచంలో ఏమీ చెయ్యలేం! అది వ్యాపార లక్షణం కాదు!!"

"పోలీసులు కూడా మీలాగా అలోచించి రకరకాల ప్లాన్స్ తో వస్తే...?"

ఆమాటలకు పకపక నవ్వి అన్నాడు.

"సామాన్యంగా రారు. వస్తే కోర్టులో హోటల్ నాది కాదని చెబుతాను. నా పేరుతో రిజిస్ట్రేషన్ కూడా ఉండదు కదా!"

"అలా చెయ్యడం 'పాపం' కదా!"

"కస్టపడి  'కూలి' చేసుకుని పొట్ట నింపు కోవచ్చు కదా! అలా కాకుండా ఇలా సంపాదించడం 'రిస్క్' అని వాళ్లకు కూడా తెలుసు. అలా తెలిసి కూడా 'ఈజీ మనీ' కి అలవాటు పడ్డారు. అనుభవిస్తారు. మనం 'సేఫ్' గా  ఉంటాం.

"ఎంతటి స్వార్థం!" అనుకున్నాడు విజయ్.\

ఆతరువాత అతను అన్నాడు.

"ప్రతి దాన్ని 'అలా' పోలీసులు ఎంక్వయిరీలు చేసి, అరెస్టులు చేస్తే 'దేశం' ఇలా ఉండేది కాదు! మనదేశంలో తప్పులు చేసి చట్టంలో ఉన్న లొసుగులు ఆధారంగా సులువుగా తప్పించుకోవచ్చు. కనుకనే చాలా మంది "పెద్ద మనషులు" తప్పించుకుంటున్నారు. మొన్న రాజకీయ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడూ రాని అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. మరొకచోట భూస్వామి హత్య చేస్తే అది నేనే చేశానని అతని పాలేరు జైలు కెళ్ళాడు. ఇద్దర్ని కాల్చి చంపిన పారిశ్రామిక వేత్తను మతిస్థిమితం లేని వ్యక్తిగా డాక్టర్లు ధ్రువీకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. ఉదాహరణలు. చట్టం, కీర్తి, డబ్బు, అధికారం ఉంటే చాలు. ఏమైనా చెయ్యెచ్చు.కాబట్టి చాలామంది రౌడీలు ,మోసగాళ్ళు కూడా 'పెద్ద మనుషులు'గా చెలామణి అవుతున్నారు. న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు. ఇది నిజం. డబ్బుంటే చాలు. సులువుగా తప్పించుకోవచ్చు..."

"నిజమేనేమో!" అనుకున్నాడు విజయ్. పెద్ద 'స్కాం' కు ఇది నాందీ కాబోతుందని అతడా క్షణం ఊహించలేదు!

*****

ఇంట్లో కుర్చీలో రిలాక్స్ గా కూర్చున్నాడు విజయ్. బోర్ గా ఫీల్ అయ్యాడు. అతనికి శిరీష గుర్తొచ్చింది. ఉత్సాహం వచ్చింది. వెంటనే శిరీష తో మాట్లాడాలనుకున్నాడు. జేబులోంచి సెల్ ఫోన్ తీసుకున్నాడు.

  తరువాత వద్దొద్దు...ఇప్పుడు చేస్తే త్వరగా పెట్టెయ్యాలి. రాత్రికి చేస్తే తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్న అలోచన కలిగింది. ఫోన్ ప్రక్కన పెట్టాడు. రిమోట్ తో 'టీవీ' ఆన్ చేసాడు. శిరీష ఫోటో కన్పించే సరికి టెన్షన్ లో కి వచ్చాడు.

ప్రముఖ  పారిశ్రామిక వేత్త ఆనందరావు కూతురు రోజు తెల్లవారు జామున విషం తీసుకుంది. ఆమెను చికిత్స కోసం నాయుడు హాస్పటల్లో చేర్పించాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆత్మా హత్యకు కారణాలు తెలియ రాలేదు. కేసు  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ...ఆతరువాత వార్తలు వినలేదు. దిగ్బ్రాంతి చెందాడు. కాసేపు అలాగే ఉండిపోయాడు. వెంటనే బయలుదేరి హాస్పిటల్ కు వెళ్ళాడు.

బెడ్ మీద పడుకుని ఉంది శిరీష.


ఆమె తల్లి ప్రక్కనే నిలబడి ఉంది. ఆమె ముఖం వాచి పోయి ఉంది. "శిరీష విషం త్రాగిందని తెలిసినప్పట్నుంచి ఏడ్చినట్లుంది!"అనుకున్నాడు విజయ్.

శిరీష దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. అమ్మాయి మెల్లిగా కళ్ళు తెరచి చూసింది.  తలపైన మెల్లగా నిమిరాడు." ఎలాఉంది?" అని ఆప్యాయంగా అడిగాడు.

బావుందన్నట్లు తల ఊపింది.


"విషం తీసుకోవడం గొప్ప అనుకున్నావా? ఒక్క క్షణం ఆలస్యం జరిగి వుంటే ఏమయ్యేది? ఎందుకలా తొందర పడ్డావు?"

"మనం కోరుకున్నది దక్కనప్పుడు ఇక బ్రతకడం దేనికీ? ఎంత డబ్బు, కీర్తి సంపాదించినా నచ్చిన వాడు దొరక్కపోతే ఏం లాభం..అది ఎంత బాధ కలుగుతుందో, నరకమో నీకు తెలుసా? జీవితమంతా అలా యాంత్రికంగా  బ్రతకడం కంటే ఇలా చనిపోవడం ఉత్తమం! "

ఇలాంటి మొండి  వాదనలే వద్దు. నాకు కోపం వస్తుంది. సోక్రటీస్, చలం, ఇందిరాగాంధీ.. ఇలాంటి వాళ్ళంతా ఇంట్లో నరకం అనుభవించారు. అయినా వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదా?...అంటూ చెబుతున్న అతని మాటలు ఎవరో వస్తున్నా అలికిడితో ఆగిపోయాయి. కోపంతో ఉన్నాడు ఆనంద రావు . అతడ్ని చూడగానే అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు.

"ఎవడ్రా నువ్వు? ఎంత దైర్యం నీకు? నా కూతుర్నే ప్రేమిస్తావా? ప్రేమంటే ఏమిటో తెలుసానీకు? డబ్బు కోసం ప్రియురాల్ని అమ్మేస్తున్నారు. చంపేస్తున్నారు...నీకు తెలుసా? డబ్బున్న వాళ్ళను ప్రేమ పేరుతో మోసం చేసే నీలాంటి లుచ్చా నా కొ...లు దేశంలో చాలా మంది ఉన్నారు. నెలకు వచ్చే జీతంతో ఎలా బ్రతకాలో లెక్కలు వేసుకునే నీకు కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు కావాలా? నీవు జీవితంలో ఎప్పుడైనా కోటి రూపాయలు చూశావా? అలాంటి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? అమ్మాయిల్ని వలలో వేసుకోవడం గొప్ప కాదురా. డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం గొప్ప..వాటికోసం ట్రై చెయ్".

ఆమాటలకు విజయ్ కోపంగా అతడి వైపు చూశాడు.

చూపులు ఆనందరావు ఆవేశాన్ని మరింత పెంచాయి.

"ఏయ్! ఏమిట్రా చూపు..! ఎలాగైనా డబ్బు సంపాదించాలన్నది మగ పుటక పుట్టిన వాడికి ఉండాల్సిన మొదట లక్షణం. ఏమీ లేని వాళ్ళు కోటీశ్వరులు  ఎలా అయ్యారు. నిరంతరం శ్రమ మూలంగా! నీలా కోటీశ్వరుల కూతుర్ని వలలో వేసుకుని కాదు. మాయ మాటలు చెప్పడం మగతనం కాదు. నాలుగు రాళ్ళు సంపాదించడంనేర్చుకో..."

"ముంచుకొచ్చిన కోపాన్ని అతికష్టం మీద కంట్రోల్ చేసుకుని వెనుదిరిగాడు విజయ్. అతను అలా రెండడుగులు ముందుకు వేశాడో, లేదో వెంటనే ఆనంద రావు పిలిచాడు.

"ఒరేయ్!ఆగరా".

విజయ్ ఆగి, తల మాత్రం వెనక్కి త్రిప్పి చూశాడు.

"ఏంటి! మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావ్. వెళ్ళిపోతే వెళ్ళిపో. మళ్లీ ఇంకెప్పుడూ ఇలా కన్పించకు. సారెప్పుడైనా మా అమ్మాయితో చూశానంటే ప్రాణాలతో బ్రతకవ్.జాగ్రత్త!" హెచ్చరించాడు.

అంతవరకు మౌనంగా ఉన్న విజయ్ కోపంతో సూటిగా ఆనందరావు పై సూటిగా చూశాడు. ఆనందరావు భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు.

"నేను తలచుకుంటే నీ కూతుర్ని ఇప్పుడే, ఇక్కడ్నుంచి తీసుకెల్లగలను. నువ్వూ! నీ డబ్బూ...నీ మనుషులు నన్నాపలేవు! అయితే  నేను పౌరుషం గల వ్యక్తిని!  నీకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు తీసుకెళతాను నీ కూతుర్ని. దొంగతనంతో కాదు. దొరతనంతో...మగతనంతో!" అని రెండడుగులు ముందుకు వేశాడు. తరువాత ఏదో గుర్తుకు వచ్చినట్లు ఆగాడు.

" లోపల నీ కూతురికి పెళ్లి చేయాలనే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. తనకి ఇష్టం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటానని వచ్చినా, పెళ్లి చేయాలని చూసినా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలసి పోతాయి" అని వార్నిగ్ ఇచ్చాడు.

అక్కడ పెద్ద వర్షం వచ్చి వెలిసినట్లయ్యింది.

*****

No comments: