Sunday, April 28, 2013

రూలర్ కథ -02


అంతలో కారు  అటువేపు రావడం చూసి కొంత దైర్యం తెచ్చుకుని, గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. ఆమె అరుపులు బయటకు రాకముందే చేత్తో ఆమె నోటిని మూసేసి, గట్టిగా పట్టుకున్నాడు ఒకడు. ప్రక్కనే ఉన్న చెట్ల దగ్గరకు లాక్కెళ్ళారు. చేత్తో కెమారాను పట్టుకుని, మరోచేత్తో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గింజు కుంటోంది.


వేగంగా కారు నడుపుతున్న విజయ్ లైట్ల వెలుగులో చెట్లదగ్గర మనుషులు కన్పించేసరికి కొద్దిగా కారు స్లో చేసాడు. అక్కడున్న వాళ్ళను చూసి జరగకూడనిది ఏదో జరుగుతుందని గ్రహించి కారుని ఆపేసాడు. క్రిందకు దిగాడు. వాళ్ళను చూశాడు.


వాళ్ళుకు విజయ్ ను చూసే సరికి కోపం కట్టలు తెంచుకుంది. "ఎవడ్రానువ్వు! ఏరియాకి కొత్తా...మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో ... ప్రాణాలతో బయట పడతావు ...లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..." హెచ్చరించారు.

విజయ్ వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ తీసాడు! వాళ్ళ మాటల్ని వీడియో తీస్తున్నాడు. వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు.

"ఏయ్! ఎవర్నువ్వు... మర్యాదగా అడిగిన ప్రశ్నకు మర్యాదగా సమాధానం చెప్పడం తెలియదానీకు? మేం ఎవ్వరిమో తెలుసానీకు?"


“తెలుసు” అన్నాడు విజయ్.


ఒక్కక్షణం వాళ్ళు అయోమయంతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. క్షణం సేపే వెంటనే తేరుకున్నారు.

" మేం ఎమ్మెల్యే మనుషులని తెలిసి కూడా మాకు అడ్డువస్తున్నావా ! ఎంత పొగరునీకు? ప్రాణాలమీద ఆశ ఉంటే ఇక్కడ్నుంచి పారిపో..."అన్నారు.



"మీకు నేనెవరినో తెలియదు. అసిస్టెంట్  కమిషనర్  ఆఫ్ పోలీస్ ని. మీ ఫోటోలు, వీడియోలు...ఇక్కడ జరుగుతున్నదంతా పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్లలో ఫీడ్ అయిపోతున్నాయి. మర్యాదగా ఆమె ను వదిలేసి  వెళ్ళిపొండి. లేకపోతే జైల్లో ఊచలు లెక్క  పెట్టాల్సివస్తుంది.మీ పెళ్ళాం పిల్లల సంగతి ఆలోచించండి".

" మాతోపెట్టుకుంటే మా ఎమ్మెల్యే మిమ్మల్ని వదిలిపెట్టరు!..." కొంచెం ధైర్యం తెచ్చుకుని చివరి అస్త్రంగా ప్రయోగించారు.

" ఆమె ను వదిలేసి వెళ్ళిపోండి. తరువాత నేనొచ్చి ఎమ్మెల్యే సర్ తో మాట్లాడతాను. లేకపోతే ఇక్కడ జరిగేవన్నీ స్టేషన్లో ఉన్న కంప్యూటర్లలో ఫీడ్ అవుతున్నాయి. అరెస్ట్  అయితే  మీరు బెయిల్ పైన విడుదలవ్వాలి.  ఆతరువాత మిమ్మల్ని ఎమ్మెల్యే కాదుకదా దేవుడు  కుడా కాపాడ లేడు. వెళ్ళండి... ఇక్కడ్నుచి  పారిపోండి..."భయపెట్టాడు.


వాళ్ళు భయంతో ఆమెను వదిలేసి పారిపోయారు.


విజయ్ కారు డోర్ తెరిచాడు. ఆమె కార్లో కూర్చుంది. కారువేగంగా వెళ్తోంది. కాసేపు తరువాత ఆమె వైపు చూశాడు. అదే క్షణం ఆమె కూడా చూసింది. వెంటనే అతను దృష్టి మరల్చి డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మద్య కాసేపు నిశ్యబ్దం రాజ్యం చేసింది. తరువాత ఆమె తన సందేహాన్ని వ్యక్తం చేసింది.


" మీరు .సి.పి.నా ...? ఎప్పుడొచ్చారు సిటీకి...?"

అతను చిన్నగా నవ్వి అన్నాడు."నేను  పొలీసాఫీసర్నికాదు. సిటీ కాలేజ్ లో లెక్చురర్ని. వాళ్ళను భయపెట్టడానికి అపద్దం చెప్పాను".


అతని తెలివి తేటల్ని మనసులోనే మెచ్చుకుంది.


ఆమెకు ఆసమయంలో కుడా నవ్వొచింది. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిచి, ఆపుకోలేక చిన్నగా నవ్వింది. ఆమె నవ్వు చూసి తను కుడా నవ్వాడు. ఆమెవైపు చూశాడు. తన గురించి అడుగు తున్నాడని గ్రహించి చెప్పింది.


"నేను జర్నలిస్ట్ ని".


"విలేకరా!" అన్నాడు ఆశ్యర్యంగా.

"అంత ఆశ్యర్యపోతా రేమిటండీ! నిజంగా నేను విలేకరిని. ఈమాట మా ఇంటిలో కుడా తెలియదు. అది వేరేసంగతీ. నేను ప్రముఖ వ్యాపారవేత్త ఆనందరావు కూతుర్ని!..."

అతడు ఆమె వైపు చిత్రంగా చూశాడు. తను చెప్పడం శ్రద్ధగా వింటున్నాడని గ్రహించి మరింత ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించింది.

రోజు సరదాగా స్నేహితులతో కల్సి ఇంటర్వ్యూకు వెళ్ళను. నేను సెలక్ట్ అయ్యాను. పార్ట్ టైం జాబ్ కాబట్టి సరదాగా కొద్ది రోజులు చేద్దాంలే అనుకున్నాను మొదట్లో. తరువాత నేను తీసిన ఫోటోలు, రాసిన వార్తలు మరుసటి రోజు పత్రికలో వస్తుంటే ,అందరూ వాటిని ఇంట్రెస్టింగా  చదువు తూంటే  చాలా సంతోషం కలిగేది.  చాలా క్రొత్త క్రొత్త విషయాలు తెలిసేవి. సంతోషం, తృప్తి మనిషికి కావలసిన వాటిలో ముఖ్యమైనవి.  ఆరెండూ ఉద్యోగంలో నాకు పుష్కలంగా లభించేవి. అప్పుడప్పుడు అవినీతిని బయటపెట్టి, నా శక్తి కొద్దీ మంచిని కాపాడుతున్నాను. సమాజానికి మేలు చేస్తున్నాను. అలా మన ఎమ్మెల్యే చేయబోయే అక్రమాల్ని వీడియో తీస్తుంటే ...వాళ్ళకు దొరికిపోయాను. ఆయన అనుచరులే వాళ్ళు..."అంటూ అర్దోక్తిగా ఆపు చేసింది.


తను చేసిన పనిని గర్వంగా ఫీల్ అయ్యింది. చెప్పింది. అతనివైపు చూసింది. తన మాటల వలన అతని ముఖంలో ఎటువంటీ మార్పు లేకపోవడంతో కాస్త అశ్యర్యపోయింది! తను చేసిన పనికి మెచ్చు కుంటాడని, అభినం దిస్తాడనీ ఊహించిన ఆమె అహం దెబ్బ తిన్నది.


"మీరు అధికార పక్షానికి వ్యతిరేకమా?..." అని అడిగాడు.


ఆమె మరింత ఆశర్యపోతూ, "వ్వాట్?" అంది.

అతను ఆమెవైపు చూడకుండా చెప్పాడు.


ఈవార్త వలన మీరు సాధిం చేది ఏది? ఎవరికీ లాభం. ఇలాంటి వార్తలు మీరు ఇలా, మేము ఇలా అని తిట్టుకోవడానికి ఉపయోగపడతాయి .చానెళ్ళవరికి న్యూస్! లీడర్లకి కొద్దిరోజులు టైం పాస్. మాలాంటివారికి  కాస్త ఎంటర్ టైన్ మెంట్ ...దేశంలో చాలా మంచి వార్తలున్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా ఇళ్ళు కట్టించాడట. గత ముఖ్యమంత్రి ఐదు ఏళ్ళలో 40లక్షలు ఇళ్ళు, ముందు ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళలో పదిహేను లక్షలు ఇళ్ళు కట్టించానన్నాడు. మరి మన రాష్ట్రంలో సగానికి పైగా గుడిసెలున్నాయి. మిగతా సగంలో చాలా వరకు సొంతంగా నిర్మించుకున్నవే! మరి ఈలేక్కలేమిటీ! పెరిగిపోతున్న నిరుద్యోగులగురించీ, అద్దెల గురించీ, ధరల గురించీ రాయొచ్చుగా ...

"అంటే న్యూస్ వలన ఉపయోగం లేదా? మేము వాటిని రాయలేదా?"

“ఉంది. ఎప్పుడో ఒకప్పుడు అలాంటివి లోపలి పేజీల్లో రాస్తారు. రాజకీయాలగురించి మాత్రం ఫుల్ గా రాస్తారు. అందులో చాలా వరకు ఉపయోగంలేనివే! ఉదాహరణకు రాజకీయనాయకులను ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ అక్రమాలపైన, రౌడీ ఇజం పైన, అన్యాయాల మీద  రకరకాల ప్రశ్నలు వేస్తారు. ప్రేక్షకులు నిజం అని నమ్ముతారు. చానెళ్ళను ఉపయోగించుకుని రాజకీయనాయకులు తమపైన వచ్చిన ఆరోపణలకు తెలివిగా వివరణ ఇచ్చుకుంటారు. తప్పించుకుంటారు ! టీవీ రేటింగ్ పెరగడంతో ఎడిటర్లు సంతృప్తి పడతారు. అందరి ప్రయోజనాలు నెరవేరుతాయి. చివరకు మోసపోయేది మాత్రం ప్రజలే!

ఆమె నోటివెంట మాట రానట్లు అతనివైపు చూస్తూ ఉండి పోయింది. అతని మాటలు ఆమెను మంత్రం వేసినట్లు కట్టి పడేశాయి.

*****

సెల్ ఫోన్ తీసుకున్నాడు విజయ్.

"హలో హనుమంత్ ! పోలీసులు ఇంకా పాప ఆచూకి తెలుపలేదు. సారి స్టేషన్ కు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఏమైంది కనుక్కుని రా!..." అన్నాడు స్నేహితునితో.

"నేనిప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. పాప ఆచూకి దొరికింది. ఈరోజు పేపర్లో యాడ్ వేసారు. పాప ప్రముఖ లాయర్ జ్యోతి గారి కూతురు.పేపర్ చూడు."


'ఏమిటీ పాప లాయర్ జ్యోతి గారి కూతురా! టాప్ టెన్ లాయర్లలో ఒకరైన జ్యోతి గారి కూతురా..." మరింత ఆశ్యర్యంగా కన్ఫర్మ్ కోసం మళ్ళీ అడిగాడు.

అవునని చెప్పాడు హనుమంత్.

"సరే. నేను పాపను తీసుకు జ్యోతి గారింటికి వస్తాను. నీవు అటునుంచి అటే వాళ్ళింటికి వచ్చేసేయ్ ."


సరేనన్నాడు హనుమంత్.

కాసేపటికి బైక్ తీసుకుని పాపతో జ్యోతి ఇంటికి వెళ్ళాడు విజయ్. అప్పటికే అక్కడ విజయ్ కోసం ఎదురు చూస్తున్నాడు హనుమంత్.

విజయ్ బైక్ గేటు ముందు ఆగింది. ఇద్దరు గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్లారు.

అప్పటికే  వాళ్ళు పాప కోసం చాలా చోట్ల వెతికినట్టున్నారు! అక్కడంతా మనుషులున్నారు.  బంధువులున్నారు. అందరి ముఖాలు దిగులుగా ఉన్నాయి. పాపను చూడగానే ఎవరో గట్టిగా అరిచారు.

"జ్యోతీ! పాప దొరికింది".

మాటలు విని రివ్వున ఇంట్లోనుండి వచ్చింది జ్యోతి. ఆమె వెనకాలే జ్యోతి భర్త కూడా వచ్చాడు.


విజయ్ నుండి ఆమె గబుక్కున పాపను లాక్కుంది. ముద్దుల వర్షం కురిపించింది. ఆమెను చూసాడు విజయ్. ఏడ్చి ఏడ్చి ముఖం వాచిపోయినట్లుంది.  పాప కనిపించక పోయినప్పటినుండి ఏడ్చి నట్లుంది అనుకున్నాడు. పాప కోసం ఆమె ఎలా బాధపడి ఉంటుందో గ్రహించాడు.

ఇక తన పని అయిపోయినట్లు భావించి, వెనుదిరిగాడు విజయ్. అప్పటివరకు పాప దొరికిందని సంతోషంలోనే ఉంది జ్యోతి.  వెంటనే విజయ్ తో , "థాంక్సండీ! మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియదు..." అంది. వెంటనే ఆమె భర్త కృతజ్ఞతగా తన మెడలోని బంగారు గొలుసు తీసి ఇవ్వబోయాడు.


వద్దని సున్నితంగా తిరస్కరించాడు విజయ్.

" పర్లేదు. తీసుకో..." మా తృప్తి కోసం అంది జ్యోతి.

"వద్దండీ! ఎంతోమంది పేదలకు ఉచితంగా సహాయం చేసే మీలాంటి గొప్ప లాయర్ ఆటోగ్రాఫ్ దొరకడం కష్టం. అలాంటిది మీతో మాట్లాడే అదృష్టం దక్కింది. అదే చాలు..."

ఆమె పొగడ్తలకు గర్వంగా ఫీల్ అయ్యింది. అయితే పైకి కనపడనివ్వలేదు.

"భవిషత్తులో మీకేదైనా కావాల్సి వస్తే రండి. తప్పకుండా సాయం చేస్తాను..."అంది జ్యోతి.

“అలాగే”నన్నాడు విజయ్.


సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు తనను కాపాడే లాయర్ అమెనన్న సంగతి అతడికి ఆక్షణం తెలియదు!


*****

1 comment:

Aravind Reddy Eluru Engineering college said...

story starting kannaa chivara baavundi. So idi super hit cinemaa avuthundi